International Delhi Public school

తెలుగు భాష ద్రావిడ భాషల కుటుంబానికి చెందిన అత్యంత ప్రాచీనమైన, సంపన్నమైన భాష. ఇది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మాట్లాడబడుతోంది. “ దేశభాషలందు తెలుగు లెస్స ” లెస్స అంటే ఉత్తమం, శ్రేష్టం (దేశభాషలన్నింటిలో తెలుగే ఉత్తమమైన భాష అని అర్థం )అని”శ్రీ కృష్ణదేవరాయలు” పేర్కొన్న ఈ భాషకి సాహిత్య పరంగా ఎంతో గొప్ప చరిత్ర ఉంది.

భాష యొక్క ప్రాముఖ్యత:

తెలుగు భాష సాహిత్యం, చరిత్ర, భక్తి ఉద్యమాలు, ప్రజా గేయాలు మొదలైన అనేక రంగాలలో విశిష్ట స్థానం సంపాదించుకుంది. కవిత్రయులైన నన్నయ, తిక్కన, ఎర్రప్రగడలు మహాభారతాన్ని తెలుగులోనికి అనువదించి భాషకు అమూల్య సేవలు చేశారు. తెలుగు పదాల మాధుర్యం, శబ్దాల సౌందర్యం కారణంగా దీన్ని “ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్” అని వర్ణిస్తారు.

తెలుగు భాష యొక్క మూలాలు:

తెలుగు భాషకు ప్రాచీనమైన మూలాలున్నాయి. ఇది క్రీ.పూ. 1500- 1000 సంవత్సరాల నాటిది.తెలుగులో లభ్యమైన మొదటి పూర్తి శాసనం ధనంజయుని కలమళ్ళ శాసనం. ఇది క్రీ.శ 575లో కమలాపురం తాలూకాలో లభ్యమైంది. తొలి శాసనాలు శాతవాహనుల కాలంలో కనిపించాయి. తరువాత నన్నయ, తిక్కన, ఎర్రప్రగడ వంటి మహాకవులు తెలుగు సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు

ప్రస్తుతం భాష అంతరించిపోవడానికి గల కారణాలు:

1. ఆంగ్ల భాష ప్రభావం :- ఆధునిక విద్యా వ్యవస్థలో ఆంగ్ల భాషకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంవల్ల పిల్లలు తమ మాతృభాషను విస్మరిస్తున్నారు.


2. పెరుగుతున్న నగరీకరణ :- కుటుంబాల మధ్య సంభాషణ కూడా ఎక్కువగా ఆంగ్లంలో జరుగుతోంది.


3. సాంస్కృతిక మార్పులు : – సినిమాలు, మీడియా, సోషల్ మీడియా వేదికల్లో తెలుగుకు తక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం.


4. ప్రాముఖ్యత లోపం :- కొందరు తమ పిల్లలతో తెలుగులో మాట్లాడకపోవడం, తెలుగు చదవడంలో ఆసక్తి లేకపోవడం వంటివి.

 

తెలుగు భాషను కాపాడుకోవడానికి సూచనలు:

1. గృహంలో తెలుగు మాట్లాడడం.పిల్లలతో తెలుగు భాషలో మాట్లాడడం ద్వారా భాష పై ప్రేమ పెంచాలి.


2. తెలుగు పుస్తకాలు చదవడం. కథలు, పద్యాలు, జాతీయ నాయకుల జీవితాలు తెలుగులో చదివించాలి.


3. సంస్కృతిక కార్యక్రమాలు.స్కూళ్ళు, కళా సంస్థలు తెలుగు నాటకాలు, పాటలు, పద్యాలపై పోటీలను నిర్వహించాలి.


4. డిజిటల్ వనరుల వినియోగం. తెలుగు భాషలో యాప్స్, వెబ్‌సైట్లు, వీడియోల తో భాషను ఆకర్షణీయంగా మార్చాలి.


5. పిల్లలకు తెలుగు భాష చరిత్ర, గొప్పతనాన్ని వివరించాలి.


ముగింపు :-

భాష ఒక జాతిని గుర్తించే ముఖచిత్రం( cover page). మన తెలుగు భాషను ప్రేమించటం, గౌరవించటం, కాపాడటం ప్రతి తెలుగు వారి బాధ్యత. ఇప్పుడైనా మేలుకొని భవిష్యత్ తరాలకు మన మాతృభాష యొక్క మూలాలు శాశ్వతంగా ఉండేలా చేద్దాం.

కె. ఉమా భారతి,
IDPS,
Telugu department.